src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
కాలక్షేపం కోసమే 'జల్సా'
ఆకాశాన్నంటిన అంచనాలు, సంబరాల మధ్య ఏప్రిల్ 2న 'జల్సా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నవేళ ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా బిజెనెస్ పరంగా, ప్రచార పరంగా విపరీతమైన క్రేజ్‌ను సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేటి క్రేజీ తార ఇలియానా హీరోయిన్. గీతా ఆర్ట్స్ బానర్‌పై ఇదివరకు తీసిన సినిమాలన్నింటికంటే భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. 'అతడు' సినిమాను త్రివిక్రమ్ రూపొందించిన తీరు చూశాక 'జల్సా' సైతం స్టైలిష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా వుంటుందని ఆశించిన వాళ్లందరూ సంతృప్తి చెందుతారు. 'జల్సా' స్టైలిష్ మూవీ. ఎంటర్‌టైనింగ్ మూవీ. పవన్ స్టైల్, అతని డైలాగ్స్ యువతని అలరించడం ఖాయం. కానీ.. పవన్ సినిమా అంటే అల్లాటప్పాగా వుంటే సరిపోతుందా? అతని పాత్ర శక్తివంతంగా కూడా వుండాలి కదా. ఆ పాత్రకు ఒక దృక్పథం వుండాలి కదా. అదిగో.. 'జల్సా'లో సరిగ్గా లోపించింది అదే. ఎలాగంటే..
కథ:
సంజయ్ సాహూ అనాథ యువకుడు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పిజి చేస్తుంటాడు. స్నేహితులతో కలిసి జీవితాన్ని 'జల్సా'గా గడిపేస్తుంటాడు. క్లాస్‌మేట్ అయిన ఒక అందమైన అమ్మాయి (కమలిని ముఖర్జీ)ని ప్రేమిస్తాడు. ఆ సంగతి ఆమె తండ్రి (ప్రకాష్‌రాజ్)కి చెబుతాడు. దానికాయన తిరస్కరించి తన కూతుర్ని ఒక సంపన్న యువకుడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత భాగ్యమతి అలియాస్ భాగీ (ఇలియానా) అనే అమ్మాయి అతనివెంట పడుతుంది. అతడి ప్రేమని పొందడానికి తిప్పలుపడుతుంది. సంజయ్ సైతం ఆమెని ప్రేమిస్తాడు. చిత్రంగా భాగీ తను ఇదివరకు ప్రేమించిన అమ్మాయి సొంత చెల్లెలు అనే సంగతి తెలుస్తుంది. సంజయ్ ఇదివరకు తన అక్కను ప్రేమించాడని తెలుసుకున్న భాగీ అతడికి దూరం కావాలనుకుంటుంది. తండ్రి చెప్పిన రఘు (శివాజీ) అనే యువకుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. మరోవైపు సంజయ్‌ని జైలులో వున్న దామోదర్‌రెడ్డి (ముఖేష్ రుషి) అనే బడా భూస్వామి మనుషులు చంపేందుకు యత్నిస్తుంటారు. ఎవరా దామోదర్‌రెడ్డి? సంజయ్‌ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు సంజయ్ నేపథ్యమేమిటి? సంజయ్, భాగీ ఒకటయ్యారా, లేదా?.. అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
కథనం:
దర్శకుడు త్రివిక్రమ్ బేసికల్‌గా రచయిత. కట్ డైలాగ్స్‌తో చక్కని వినోదాన్ని పుట్టించడంలో దిట్ట. 'జల్సా'తో మరోసారి ఆ సంగతి అతను నిరూపించుకున్నాడు. అయితే సంజయ్ పాత్ర చిత్రణ విషయంలో అతను పెద్ద పొరబాటు చేశాడు. పవన్ వంటి స్టార్ హీరో చేసే సినిమాలో అతని పాత్ర చిత్రణ ఎంత బలంగా వుండాలి! ఆ పాత్ర దృక్పథం ఎంత దృఢంగా వుండాలి! ఆ విషయంలోనే 'జల్సా' బలహీనమైపోయింది. కథ ప్రకారం సురక్షిత మంచినీటికి దూరంగా, కరీంనగర్‌లోని ఒక మారుమూల గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి, పేదరికాన్ని అనుభవిస్తాడు సంజయ్. చిన్నతనంలో అతని తమ్ముడు గుండెలో చిల్లుతో చనిపోతాడు. పెద్దయ్యాక పొలానికి పురుగుపట్టి, పురుగుల మందుతాగి తండ్రి చనిపోతాడు. ఆ దిగులుతో తల్లీ చనిపోతుంది. ఒంటరివాడైన సంజయ్ సమాజం మీద కసితో నక్సలైట్‌గా మారతాడు. పోలీసులతో జరిగిన పోరాటంలో అతడూ, ఒక పోలీసాఫీసర్ (ప్రకాష్‌రాజ్) మాత్రమే మిగులుతారు. 8 గంటల సహ ప్రయాణంలో ఆ ఇద్దరూ మనుషులుగా మిగులుతారు. ఒక మంత్రిని మందుపాతర నుంచి కాపాడతాడు సంజయ్. అతడికి పునరావాసం లభిస్తుంది. ఇదంతా ద్వితీయార్థంలో వచ్చే సంజయ్ గతం. వర్తమానంలో అతడు పునరావాసంలో వున్న మాజీ నక్సలైట్. అలాంటివాడు స్నేహితులతో కలిసి మందు తాగుతూ 'జల్సా' చేయడంలో ఏమన్నా అర్ధముందా? ప్రభుత్వం అతడికి పునరావాసం కల్పించింది అందుకా? పేదరికంలో పుట్టి, తన కళ్లముందే ఆ పేదరికం కారణంగా మూడు చావులు చూసినవాడు జీవితాన్ని ఎలా 'జల్సా'గా గడుపుతాడు? అంటే హీరో పాత్ర గతాన్నీ, వర్తమానాన్నీ సమన్వయించడంలో దర్శకుడు త్రివిక్రమ్ విఫలమయ్యాడు. ఖచ్చితంగా తన గతం తాలూకు జ్ఞాపకాలు ఎవరినైనా వెంటాడుతుంటాయి. హీరో పాత్ర దాన్ని మరచి వ్యవహరించడంతో ఆ పాత్రకు నిర్దిష్టమైన దృక్పథం లేకుండా పోయింది. పైగా తన స్నేహితుడికి తన గతాన్ని పరిచయం చేసే సన్నివేశంలో సంజయ్ ఎంతో ఆవేశంగా డైలాగ్స్ చెబుతాడు. తాను ఇదివరకు నక్సలైటునని అతడు ఆవేశంగా చెప్పడం ఇంటెర్వల్ బ్యాంగ్. అదిచూసి ఆ నక్సలైట్ ఎపిసోడ్ ఎంతో భావోద్వేగ పూరితంగా వుంటుందని భావించిన వాళ్లను దర్శకుడు చాలా అసంతృప్తికి గురిచేశాడు. ఆ ఎపిసోడ్‌ని చాలా సాదాసీదాగా చిత్రించాడతను. అంతేకాదు పవన్, ప్రకాష్‌రాజ్ మధ్య సన్నివేశాలతో ఆ అడవి సన్నివేశాల్ని కూడా వినోదం కోసం వాడుకుని హీరో దృక్పథాన్ని చులకన చేసేశాడు. ఇది హీరో క్యారెక్టరైజేషన్‌ని బాగా దెబ్బతీసింది.
దామోదర్‌రెడ్డి ఎందుకు సంజయ్‌ను చంపించేందుకు యత్నిస్తాడనేది చివరిదాకా ఒక పజిల్. సినిమా ఇంకో అరగంటలో ముగుస్తుందనేదాకా దామోదర్‌రెడ్డి ఎవరో సంజయ్‌కు తెలీకపోవడం స్క్రీన్‌ప్లేలో దొర్లిన ఒక లోపం. తనెందుకు అతణ్ణి చంపాలనుకుంటున్నాడో హీరోకి విలన్ చెప్పాల్సి రావడం బాక్సాఫీస్ సూత్రం కాదు. స్టార్ హీరో సినిమాలో హీరో విలన్ల మధ్య పోరాటం ప్రత్యక్షంగా కొనసాగుతుంటేనే మజా. అలాకాకుండా ఎవరో తనను చంపడానికి వస్తే, హీరో వాళ్లను చితగ్గొట్టడం మాస్‌ని మెప్పించే అంశం కాదు. క్లైమాక్స్ సన్నివేశాలు శక్తివంతంగా లేకపోవడం మరో లోపం. ఆ సన్నివేశాలకంటే అంతకు మునుపటి యాక్షన్ సన్నివేశాలే కాస్త బలంగా తోస్తాయి. అర్జెంటీనా విప్లవ యోధుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని హీరో బృందం మందు కొడుతూ 'జల్సా' చేయడం దారుణం. ఇన్ని లోపాల మధ్యకూడా త్రివిక్రమ్ ఒక విషయంలో మాత్రం తన సత్తా చూపాడు. అది వినోదం. తనకే సాధ్యమైన మెరుపులు, విరుపుల సంభాషణలు, సన్నివేశాలతో చక్కని వినోదాన్ని పంచాడు. హీరో పాత్రలోనే ఆ వినోదాన్ని జొప్పించడంతో సినిమా విసుగెత్తకుండా సాగింది. ప్రథమార్ధంలో పవన్, ఇలియానా మధ్య సన్నివేశాలు, ద్వితీయార్ధంలో పవన్, బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు మంచి వినోదాన్ని అందించాయి. దామోదర్‌రెడ్డి క్రూరత్వాన్ని బాగా చూపగలిగిన దర్శకుడు ఆ పాత్రకీ, హీరో పాత్రకీ మధ్య ఘర్షణని మొదట్నించీ పండించినట్లయితే సినిమా మరింత ఆసక్తికరంగా తయారయ్యేది.
నటీనటుల అభినయం:
ఇదివరకు 'అన్నవరం' పాత్రలో నిరాశపరచిన పవన్ 'జల్సా'లో సంజయ్ సాహు పాత్రలో ఇమిడిపోయాడు. అతని బాడీ లాంగ్వేజ్‌కు సంజయ్ తరహా జోవియల్ పాత్రలు బాగా నప్పుతాయని స్పష్టమైనట్లే. ఈ సంగతి తెలిసినట్లే అతని పాత్రను మలిచాడు త్రివిక్రమ్. వినోదభరితమైన సన్నివేశాల్లో పవన్ తనదైన రీతిలో చెలరేగాడు. 'ఖుషి'లోని సిద్ధార్థ రాయ్ పాత్రను జ్ఞప్తిచేశాడు. అయితే అతను నక్సలైట్‌గా మారే విధానం మాత్రం బలహీనంగా వుంది. భాగ్యమతి అలియాస్ భాగీగా ఇలియానా మరోసారి తన అందచందాలు, అభినయంతో ఆకట్టుకుంది. తొలి సన్నివేశాల్లో మాత్రం ఆమె ముఖానికి మేకప్ ఎక్కువైంది. పవన్‌తో ఆమె జోడీ బాగుంది. ఇలియానా కంటే ముందు పవన్‌కి 'ఐ లవ్ యు' చెప్పే ఆమె స్నేహితురాలు జ్యోత్స్న పాత్రలో పార్వతీ మెల్టన్‌కి నటించే అవకాశం రాలేదు. ఇలియానా అక్కగా కమలినిది అతిథి పాత్ర. దామోదర్‌రెడ్డి పాత్రలో ముఖేష్ రుషి రాణించాడు. క్రూరత్వాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లో మెప్పించిన ఆయన చివరలో మాటలేమీ లేకుండా పవన్‌ను చూసి హావభావాలు ప్రదర్శించడంలోనూ మార్కులు సంపాదించాడు. హీరోయిన్ల తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. చాలా ఈజీగా నటించేశాడు. సెకండాఫ్ మరీ బలహీన పడకుండా కాపాడిన పాత్రల్లో బ్రహ్మానందం పోషించిన హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ పాత్ర ప్రధానమైంది. ఆయనతో బాటు అలీ, సునీల్, ధర్మవరపు తమ వంతు కామెడీని అందించారు.
టెక్నీషియన్ల పనితనం:
ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లలో అందరికంటే ఎక్కువ మార్కులు పడేది త్రివిక్రమ్‌లోని రచయితకే. వినోదభరిత పంచ్ డైలాగులతో అతను సినిమాకు జీవం తెచ్చాడు. మిగతా టెక్నీషియన్లు కూడా తమ పరిధుల మేరకు సినిమా నాణ్యతకు కృషి చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి అలరిస్తుంది. అన్నిటికంటే టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. సీతారామశాస్త్రి పాటలు అలరించాయి. రీ రికార్డింగ్ సన్నివేశాలకు యాప్ట్‌గా వుంది. ఎంఎస్ గుహన్, రసూల్ సంయుక్తంగా అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎస్సెట్. హీరో హీరోయిన్ల క్లోజప్ సన్నివేశాల్లో ఆ పనితనం స్పష్టంగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు, పాటల్లో కెమెరా చురుగ్గా పనిచేసింది. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్‌కు సాధారణంగా వంక పెట్టలేం. కానీ ఇందులో విలన్‌కు సంబంధించిన సన్నివేశాల కూర్పే అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ మినహా మిగతా ఫైట్లను విజయ్ ఆకర్షవంతంగా రూపొందించాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ప్రశంసనీయం.
బలాలు, లోపాలు:
పవన్ కల్యాణ్ నటన, ఇలియానా గ్లామర్, వినోదభరిత సన్నివేశాలు, సంభాషణలు, సినిమాటోగ్రఫీ, సంగీతం బలాలు. హీరో పాత్ర చిత్రణ బలంగా లేకపోవడం, హీరోకూ, విలన్‌కూ మధ్య ప్రత్యక్ష ఘర్షణ లేకపోవడం, ద్వితీయార్ధంలో స్క్రీన్‌ప్లే వేగం మందగించడం, క్లైమాక్స్ బలహీనంగా వుండటం లోపాలు. మొత్తంగా చూస్తే పవన్ కల్యాణ్ నుంచి ఎక్కువగా ఆశించే వారిని అసంతృప్తికి గురిచేసే ఈ సినిమా కాలక్షేప ప్రియులను మాత్రం సంతృప్తి పరుస్తుంది.